10, జులై 2020, శుక్రవారం

మాన్యంబు లీయ స-మర్ధుఁ డొక్కఁడు లేఁడు

సీ॥
మాన్యంబు లీయ స- మర్ధుఁ డొక్కఁడు లేఁడు
మాన్యముల్ చెఱుప స-మర్ధులంత
యెండిన యూళ్ళగోఁ-డెరిఁగింపఁ డెవ్వడు
పండిన యూళ్ళకుఁ-ప్రభువులంత
యితఁడు పేద యటంచు-నెఱిగింపడెవ్వడు
గలవారి సిరులెన్న-గలరు చాలఁ
దన యాలి చేష్టల-దప్పెన్నఁ డెవ్వడు
పెఱకాంత ఱంకెన్నఁ-బెద్దలంత
తే॥
యిట్టి దుష్టుల కధికార-మిచ్చినట్టి
ప్రభువు తప్పులంచును మరి-బలుకవలెను
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

8, జులై 2020, బుధవారం

కోతికి జలతారు-కుళ్ళాయి యేటికి?

సీ॥
కోతికి జలతారు-కుళ్ళాయి యేటికి?
విరజాజి పూదండ-విధవ కేల?
ముక్కిడి తొత్తుకు-ముత్తెంపు నత్తేల?
అద్దమేటికి జా-త్యంధునకును?
మాచకమ్మకు నేల-మౌక్తిక హారముల్?
క్రూరచిత్తునకు స-ద్గోష్టులేల?
ఱంకుబోతుకు నేల-బింకంపు నిష్ఠలు
వావి యేటికి దుష్ట-వర్తనునకుఁ
తే॥
మాటనిలకడ సుంకరి-మోటుకేల?
చెవిటివానికి సత్కథా-శ్రవణమేల?
భూషణవికాస!శ్రీధర్మ-పురవివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

7, జులై 2020, మంగళవారం

పసరంబు పంజైనఁ-బసులఁ గాపరి తప్పు

సీ॥
పసరంబు పంజైనఁ-బసులఁ గాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన-ప్రభుని తప్పు
భార్య గయ్యాళైనఁ-బ్రాణనాథుని తప్పు
తనయుండు దుష్టైనఁ-తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన-సైన్యనాథుని తప్పు
కూఁతురు చెడుగైన-మాత తప్పు 
అశ్వంబు చెడుగైన-నారోహకుని తప్పు
హస్తి దుష్టైన-హస్తీపకుని తప్పు
తే॥
ఇట్టి తప్పులెఱుంగక-యిచ్చవచ్చి
నటుల మెలఁగుదు రిప్పుడీ-యవని జనులు
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

5, జులై 2020, ఆదివారం

గార్ధభంబున కేల-కస్తూరి తిలకంబు

సీ|| గార్ధభంబున కేల- కస్తూరి తిలకంబు మర్కటంబున కేల-మలయజంబు శార్దూలముల కేల-శర్కరాపూపంబు సూకరంబున కేల-చూతఫలము మార్జాలమున కేల- మల్లెపువ్వుల బంతి గుడ్లగూబకు నేల-కుండలములు మహిషంబున కేల- నిర్మల వస్త్రముల్ బక సంతతికి నేల-పంజరంబు తే॥ ద్రోహచింతన జేసెడు-దుర్జనులకు మధురమైనట్టి నీ నామ-మంత్రమేల భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస! దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

3, జులై 2020, శుక్రవారం

అర్ధివాండ్రకు నీక-హాని చేయుట కంటె

సీ॥
అర్ధివాండ్రకు నీక-హాని చేయుటకంటె
దెంపుతో వసనాభి- దినుటమేలు
ఆడుబిడ్డల సొమ్ము-నపహరించుటకంటె
బండఁ గట్టుక నూతఁ-బడుటమేలు
పరుల కాంతలబట్టి-బల్మిఁ గూడుటకంటె
బడబాగ్ని కీలలఁ-బడుటమేలు
బ్రతుకఁజాలక దొంగ-పనులు చేయిటకంటె
కొంగుతో ముష్టెత్తు-కొనుటమేలు
తే॥
జలజదళనేత్ర నీ భక్త-జనులతోడ
జగడమాడుటకంటెను-చావుమేలు
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

2, జులై 2020, గురువారం

నరసింహ శతకము...గౌతమీ స్నానాన-గడతేరుదామంటె

సీ॥
గౌతమీ స్నానాన-గడతేరుదామంటె
మొనసి చన్నీళ్ళలో-మునగలేను
తీర్థయాత్రలచేఁ గృ-తార్థుఁ డౌదామంటె
బడలి నేమంబు నే-నడుపలేను
దానధర్మముల స-ద్గతిని జెందుదమంటె
ఘనముగా నా వద్ద-ధనము లేదు
తపమాచరించి సా-ర్ధకత నొందుదమంటె
నిమిషమైన మనసు-నిలుప లేను
తే॥
కష్టముల కోర్వ నా చేతఁ-కాదు,నిన్ను
స్మరణ చేసెద నా యథా-శక్తి కొలఁది
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!సరసింహ!-దురితదూర!

1, జులై 2020, బుధవారం

శ్రవణ రంధ్రముల నీ- సత్కథల్ పాడంగ

సీ॥
శ్రవణ రంధ్రముల నీ- సత్కథల్ పాడంగ
లేశ మానందంబు-లేనివాడు
బుణ్యవంతులు నిన్నుఁ-బూజసేయఁగ జూచి
భావమం దుత్సాహ-పడనివాఁడు
భక్తవర్యులు నీ ప్రభా-వముల్ పొగడంగఁ
దత్పరత్వము లేక-తలఁగువాఁడు
తన చిత్తమందు నీ-ధ్యాన మెన్నఁడులేక
కాలమంతయు వృధా-గడపువాఁడు
తే॥
వసుధలోనెల్ల వ్యర్ధుడు-వాఁడెయగును
మరియు జెడుగాక యెప్పుడు-మమతనొంది
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర !