30, జులై 2020, గురువారం

ఉర్విలో నాయుష్య-మున్న పర్యంతంబు

సీ॥
ఉర్విలో నాయుష్య-మున్న పర్యంతంబు
మాయ సంసారంబు-మఱిగి నరుఁడు
సకల పాపములైతె-సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి-నేర్వలేఁడు
తుదకు గాలుని వద్ద-దూత లిద్దఱు వచ్చి
గుంజుక చిన్న వారు-కొట్టుచుండ
హింస కోర్వఁగ లేక-యేడ్చి గంతులు వైచి
దిక్కు లేదని నాల్గు-దిశలు జూడఁ
తే॥
తన్ను విడిపింపవచ్చెడి-ధన్యుడేడి!
ముందు నీ దాసుఁడై యున్న-ముక్తి గలుగు
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

29, జులై 2020, బుధవారం

అతిశయంబుగఁ కల్ల-లాడనేర్చితిఁ గాని

సీ॥
అతిశయంబుగఁ కల్ల-లాడనేర్చితిఁ గాని
పాటిగా సత్యముల్-పలికి యెరుగ
సత్కార్య విఘ్నముల్-సలుప నేర్చితిఁ గాని
యిష్ట మొందగ-నిర్వహింప నేర
ఒకరి సొమ్ముకు దోసి లొగ్గ- నేర్చితిఁ గాని
చెలువుగా ధర్మంబు-సేయనేర
ధనము లియ్యంగ వ-ద్దనగ నేర్చితిఁ గాని
శీఘ్ర మిచ్చెడునట్లు-చెప్పనేరఁ
తే॥
పంకజాతాక్ష!నేనెంత-పాతకుడను!
దప్పులన్నియు క్షమియింప-దండ్రి నీవె
భూషణవికాస! శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!


27, జులై 2020, సోమవారం

నీమీద కీర్తనల్-నిత్య గానముఁ జేసి

సీ॥
నీ మీద కీర్తనల్-నిత్య గానముఁ జేసి
రమ్యమొందింప నా-రదుఁడఁగాను
సావధానముగ నీ-చరణ పంకజ సేవ
సలిపి మెప్పింపంగ-శబరిఁ గాను
బాల్య మప్పటినుండి-భక్తి నీయందున
గలగగ బ్రహ్లాద-ఘనుఁడగాను
ఘనముగా నీమీఁద-గ్రంథముల్ గల్పించి
వినుతి సేయను వ్యాస-మునిని గాను
తే॥
సాధుఁడను,మూర్ఖమతి,మను-ష్యాధముడను,
హీనుడను సుమ్మి నీవు న-న్నేలుకొనుము!
భూషణవికాస!శ్రీథర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

26, జులై 2020, ఆదివారం

ఇభరాజవరద!ని-న్నెంత పిల్చినఁగాని

సీ॥
ఇభరాజవరద!ని-న్నెంత పిల్చినఁగాని
మాఱుపల్కవ దేమి-మౌని తనము?
మునిజనార్చిత-నిన్ను-మ్రొక్కి వేఁడినఁగాని
కనులఁ బడవదేమి-గడుసుదనము?
చాల దైన్యమునొంది-చాటు జొచ్చినఁగాని
భాగ్యమియ్య వదేమి-ప్రౌఢితనము?
స్థిరముగా నీ పాదసేవఁ -జేసెదనన్న
దొరకఁజాల వదేమి-ధూర్తతనము?
తే॥
మోక్షదాయక!ఇటువంటి-మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి-కడుపునిండు?
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!దురితదూర!

25, జులై 2020, శనివారం

తల్లితండ్రులు భార్య-తనయు లాప్తులు బావ

సీ॥
తల్లిదండ్రులు భార్య-తనయు లాప్తులు బావ
మఱుదులన్నలు మేన-మామగారు
ఘనముగా బంధువుల్-గల్గినప్పటికైన
దాను దర్లగ వెంటఁ-దగిలి రారు
యమునిదూతలు ప్రాణ- మపహరించుక పోఁవ
మమతతోఁ బోరాడి-మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ-పడుట మాత్రమె కాని
యించుక నాయుష్య-మివ్వలేరు
తే॥
చుట్టములమీఁది భ్రమదీసి- చూరబెట్టి
సంతతము మిమ్మునమ్ముట-సార్థకంబు
భూషణవికాస! శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

24, జులై 2020, శుక్రవారం

పాంచభౌతికము దు-ర్భరమైన కాయం బి

సీ॥
పాంచ భౌతికము దు-ర్భరమైన కాయం బి
దెప్పుడో విడచుట-యెఱుక లేదు
శత వర్షములదాఁక-మితముఁ జెప్పిరి గాని
నమ్మరాదా మాట-నెమ్మనమున
బాల్యమందో,మంచి - ప్రాయమందో,లేక,
ముదిమియందో లేక-ముసలియందొ,
యూరనో,యడవినో-యుదక మధ్యముననో
యెప్పుడో విడుచుట- యే క్షణంబొ
తే॥
మరణమే నిశ్చయము బుద్ధి-మంతుఁడైన
దేహమున్నంతలో మిమ్ముఁ -దెలియవలయు
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

22, జులై 2020, బుధవారం

బ్రతికినన్నాళ్ళు నీ -భజన తప్పను గాని

సీ॥
బ్రతికినన్నాళ్ళు నీ-భజన తప్పను గాని
మరణకాలము నందు మఱుతునేమొ!
ఆవేళ యమదూత-లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి-పట్టునపుడు
కఫవాత పైత్యముల్-గప్పగాఁ భ్రమచేత
గంపముద్భవముంది-కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను-నారాయణా యంచు
బిలుతునో,శ్రమచేతఁ-బిలువలేనొ!
తే॥
నాఁటికిప్పుడె భక్తి నీ-నామ భజన
తలఁచెదను జెవిని వినవయ్య-ధైర్యముగను
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!