12, ఆగస్టు 2020, బుధవారం

అతి విద్య నేర్చుట-యన్న వస్త్రములకే

సీ॥
అతి విద్య నేర్చుట-యన్న వస్త్రములకే
పశుల నార్జించుట- పాల కొఱకె
సతిని బెండ్లాడుట- సంసార సుఖమునకే
సుతులఁ బోషించుటఁ-గతుల కొఱకె
సైన్యముల్ గూర్చుట-శత్రు భయంబుకే
సామునేర్చుటెల్ల-చావు కొఱకే
దానమిచ్చుట ముం-దటి సంచితమునకె
ఘనముగాఁ జదువుటల్-కడుపు కొఱకె
తే॥
యితర కామంబుఁ గోరక-సతతముగను
భక్తి నీ యందు నిలుపుట-ముక్తి కొఱకె
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

5, ఆగస్టు 2020, బుధవారం

భువనరక్షక!నిన్నుఁ -బొగడ నేరని నోరు

సీ॥
భువనరక్షక!నిన్నుఁ-బొగడ నేరని నోరు
బ్రజ కగోచరమైన-పాడుబొంద
సురవరార్చిత!నిన్ను-జూడ గోరని కనుల్
జలములోపల నెల్లి-సరపుగుండ్లు
శ్రీరమాధిప!నీకు-సేవఁ జేయని మేను
కూలి కమ్ముడువోని-కొలిమి తిత్తి
వేడ్కతో నీ కథల్-వినని కర్ణంబులు
గఠిన శిలాదుల-గలుగు దొఱలు
తే॥
పద్మలోచన నీ మీఁద-భక్తి లేని
మానవుఁడు రెండు పాదాల-మహిషమయ్య
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

4, ఆగస్టు 2020, మంగళవారం

కర్ణ యుగ్మమున నీ-కథలు సోకినఁ జాలు

సీ॥
కర్ణ యుగ్మమున నీ-కథలు సోకినఁజాలు
పెద్ద పోగుల జోళ్ళు-పెట్టినట్లు
చేతులెత్తుచుఁ బూజ-చేయఁగల్గినఁ జాలు
దొరగ్గాన కడియాలు-దొడిగినట్లు
మొనసి మస్తకముతొ- మ్రొక్కఁగల్గినఁ జాలు
జెలువమైన తీరాయి-జెక్కినట్లు
స్వరము నొవ్వంగ నీ-స్మరణ గల్గినఁజాలు
వింతగా కంఠాలు-వేసినట్లు
తే॥
పూని నినుఁ గొల్చుటే సర్వ-భూషణంబు
లితర భూషణముల నిచ్చ- గింపనేల?
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

3, ఆగస్టు 2020, సోమవారం

భుజబలంబునఁ బెద్ద- పులులఁ జంపంగవచ్చు

సీ॥
భుజబలంబునఁ బెద్ద-పులులఁ జంపంగవచ్చు
పాము కంఠముఁ చేత-బట్టవచ్చు
బ్రహ్మరాక్షస కోట్ల-బాఱఁద్రోలఁగ వచ్చు
మనుజుల రోగముల్-మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని-చేదు మ్రింగగవచ్చు
పదును ఖడ్గము చేత- నదుమవచ్చుఁ
గష్ట మొందుచు ముండ్ల-కంపలోఁ జొరవచ్చుఁ
దిట్టుబోతుల నోళ్ళు-కట్టవచ్చుఁ
తే॥
పుడమిలో దుష్టులకు జ్ఞాన-బోధ తెలిపి
సజ్జనులఁ జేయలేఁడెంత-చతురుఁడైన
భూషణవికాస!శ్రీధర్మ-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

2, ఆగస్టు 2020, ఆదివారం

అవనిలోఁగల యాత్ర-లన్ని చేయగవచ్చు

సీ॥
అవనిలోఁగల యాత్ర-లన్ని చేయగవచ్చు
ముఖ్యమౌ నదులందు-మునుఁగవచ్చు
ముక్కు పట్టుక సంధ్య-మొనసి వార్చగవచ్చు
దిన్నఁగా జపమాల-ద్రిప్పవచ్చు
వేదాల కర్ధంబు-విఱిచి చెప్పఁగవచ్చు
శ్రేష్ఠ క్రతువులెల్ల-జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు-దానమీయగవచ్చు
నైష్ఠి కాచారముల్-నడుపవచ్చు
తే॥
చిత్త మన్యస్థలంబునఁ-జేరకుండ
నీ పదాంభోజములందు-నిలుపగలమె?
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

1, ఆగస్టు 2020, శనివారం

అధిక విద్యావంతు-లప్రయోజకులైరి

సీ॥
అధిక విద్యావంతు- లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా-పూజ్యులైరి
సత్యవంతుల మాట-జన విరోధంబాయె
వదఱుబోతులమాట-వాసికెక్కె
ధర్మవాదనపరుల్-దారిద్ర్యమొందిరి
పరమ లోభులు ధన-ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ-భూత పీడితులైరి
దుష్టమానవులు వ-ర్దిష్ణులైరి
తే॥
పక్షివాహన!మావంటి-భిక్షకులకు
శక్తిలేదాయె నిఁక నీవె-చాటు మాకు
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!

30, జులై 2020, గురువారం

ఉర్విలో నాయుష్య-మున్న పర్యంతంబు

సీ॥
ఉర్విలో నాయుష్య-మున్న పర్యంతంబు
మాయ సంసారంబు-మఱిగి నరుఁడు
సకల పాపములైతె-సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి-నేర్వలేఁడు
తుదకు గాలుని వద్ద-దూత లిద్దఱు వచ్చి
గుంజుక చిన్న వారు-కొట్టుచుండ
హింస కోర్వఁగ లేక-యేడ్చి గంతులు వైచి
దిక్కు లేదని నాల్గు-దిశలు జూడఁ
తే॥
తన్ను విడిపింపవచ్చెడి-ధన్యుడేడి!
ముందు నీ దాసుఁడై యున్న-ముక్తి గలుగు
భూషణవికాస!శ్రీధర్మ!-పురనివాస!
దుష్టసంహార!నరసింహ!-దురితదూర!